Thursday, November 27, 2014

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ from Aditya 369 review



సరదాగా సాగిపోయే ఈ పాట గురించి సరదాగా కాసేపు..
అవసరమైన చోటల్లా అలంకారాలతో పాటని అలంకరించడం మన వేటూరి గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో కదా!!
అలాగే పాటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా గురువుగారు దిట్ట అని కొత్తగా చెప్పక్కరలేదేమో!!
ఇక ఈ పాట ని ఎంజాయ్ చేస్తూ కాస్త వేటూరి గారి గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథ ప్రకారం.. కాలేజి లో స్టూడెంట్స్ సరదాగా పాడుకునే పాట ఇది..
వాళ్ల వయసులో ఉండే ఊపు, ఏదైనా చేయగలం అనే ఉత్సాహం..మాకు హద్దులు లేవు అన్న హుషారు.. ఈ పాట లో ప్రతిబింబించారు..
అందుకు నాంది గా పల్లవి ఎత్తుకున్నారు..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
ఈ రెండు లైన్ల లో పైన చెప్పినవి అన్నీ కవర్ చేసేసారు..
కానీ వూరికే చెప్పేస్తే ఎలా.. బాష మీద ప్రేమ కూడా చూపించాలిగా.. అందుకే..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
అన్నారు..
మజా ని జావళి గా మార్చి అన్న దాన్ని మజామజావళీ చేసేసారు..
చెలి జోడియోలో.. అన్నది ప్రాస కోసం చేసిన మంచి ప్రయోగం గా చెప్పొచ్చు..
ఇక చరణాల లోకి వస్తే ప్రతీ లైను ఒక మంచి ప్రయోగం తో కూడుకున్నవే..
మేఘమాలనంటుతున్న యాంటెనాలతో..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
ఆహా.. ఎంత చక్కని ఊహ.. అర్థం కాని వారికి ఏంటో ఇది అనిపిస్తుంది.. అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది..
తర్వాతి రెండు లైన్లు చక్కని ప్రాసతో నడుస్తాయి..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో..
వలపు వేణువూది చూడు వందనాలతో..
తందనాలతో..చందనాలతో.. వందనాలతో.. వీటిని తన పాటల్లో తరుచూ వినిపించే వెన్నెల, వలపు, వేణువు తో కలిపారు..
ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసకోసమే పడిచచ్చిపోయే వాళ్ళలాగా రాస్తారు గాని.. అవి అర్థవంతం గా ఉండి చావవు.. తెలుగుని చింపేసి చంపేసి.. విన్నవాళ్లకి చావాలి అనిపించేలా చేస్తూంటారు.. సర్లె వాళ్ల గురించి ఇపుడు ఎందుకులే..
తర్వాత లైన్ లో..
చక్రవాక వర్షగీతి వసంతవేళ పాడు
తుళ్లిపడ్డ ఈడుజోడు తుఫానులో..
వర్షం పడుతున్నప్పుడు చక్రవాక పక్షి పాడే పాటకి, జంటలు తుఫాను లా అల్లరి చేస్తూ రెచ్చిపోతారు అని కాబోలు..
లేదా
చక్రవాకం అనే రాగం లో మంచి వాన పాట వస్తుంటే అమ్మాయి అబ్బాయి ల హుషారు తుఫాను లా చెలరేగింది అని కాబోలు..
చక్రవాకం అంటే ఇక్కడ పక్షి అనా.. లేక రాగం అనా..?
అర్థం చేసుకున్న వాళ్లకి అర్థం చేసుకున్నంత.. నేనెంత వాడిని సరిగ్గా ఆయన భావం ఊహించడానికి?
లైఫు వింత డాన్సు.. లిఖించు కొత్త ట్యూన్సు..
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు..
జీవితం చాలా చిన్నదనీ.. ఎల్లప్పుడూ మూస పధ్ధతే కాక ప్రయోగాలు చేయాలనీ..అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి అన్న తత్వాన్ని (సైన్స్ - శాస్త్రం) జొప్పించేసారు ఈలోపే.. చక్కని ప్రాస తో సహా
ఒక ఇంటర్వ్యూ లో ఆయనే స్వయంగా చెబితే విన్నా.. పాటలో అవకాశం దొరికితే ఏదైనా సందేశం చెప్పాలి వూరికే కొన్ని లైన్లు పదాలతో నింపేయడం కాదు అని.. అది ఇదేనేమో!
తరవాత లైన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే..
వాయులీన హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ..
వినసొంపైన చక్కని వయొలిన్ గానాలు మనచూట్టూ నిండినపుడు.. అని అర్థం..
ఇళయరాజా గారి స్వరం గెలుస్తుందా.. వేటూరి గారి పదం గెలుస్తుందా అన్న దానికి ఈ లైను చక్కని వేదిక.. అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నా.. నాకు ఇద్దరూ ఇష్టమే కాబట్టి..
రెండో చరణం మరిన్ని ప్రయోగాలకు నిలయం..
వెచ్చనైన ఈడుకున్న వేవులెంక్తు లో
రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో...
ఒక ఇంగ్లీషు పదానికి మరొక అచ్చ తెలుగు పదానికి సందర్బానుసారంగా అర్థవంతంగా..ఇంతకన్నా మంచి అంత్య ప్రాస దొరకదేమో అన్నట్లు ఉంటుంది..ఈ లైన్
వేడెక్కి ఉన్న ఈ వయసులో భావాల్ని పాటగా రాస్తే.. ఆ పాట ఎంత రాసినా అయిపోదు అని..
విచ్చుకున్న పొద్దుపూవు ముద్దు తోటలో..
కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో..
ఉదయాన్నే లేచే సరికి కొత్త ఉత్సాహం తో కోకిల పాటలు పాడుతుంది..
ఐతే ఇక్కడ ఆ ఉదయాన్ని ముద్దు పూల తోట గా వర్ణించడం కవిత్వం ఐతే..
కోకిలమ్మ గొంతుకి ఎన్ని కొత్త పాటలు వస్తాయో అనకుండా.. కోకిలమ్మ పాటకి ఎన్ని కొత్త గొంతులు వస్తాయో కదా అనడం వేటూరి మార్క్ ప్రయోగం..
వేటూరి గారికి యమక గమకాలంటే ఎంత ఇష్టమో తెలిసిందే.. అందుకే ఇక్కడ కూడా ఒకటి వేసారు..
గతాగతాల కన్నా.. ఇవాళనీది కన్నా..
ఇది ఒక చక్కని యమకాలంకారం.. మొదటి "కన్నా" అనేది పోల్చడం ఐతే.. రెండో "కన్నా" అనేది అబ్బాయి ని సంభోదించడం..
మొదటి చరణం లాగానే రెండో చరణం లో కూడా ఒక మంచి లైన్..
పాటలన్ని పూవులైన తోట లాంటి లేత యవ్వనాన..
ఈ యవ్వనం అనేది ఒక పూదోట అంట.. అందులో పువ్వులు ఎమిటీ అంటే పాటలేనట..
ఆయన కలం పట్టుకుంటేనే అక్షరాలు ఇల జాలువారతాయేమో కదా..!!!
వేటూరి గారి పాద పద్మాలకు నమస్కారం...

2 comments:

  1. Nice one Raghu..too good..veturi gari alochanalanu ardham chesukuni.. andariki vivarinche nee chiru prayathnam chala bavundi.. indulo veturi gari goppathanam adbhutham ga cheppav.. ekado evaro annaru..mana kavulantha cine lyric writers avadam valana valla goppathanam maruguna padipoindi ani..adi aksharala nijam :) Hatsofff to Veturi garu

    ReplyDelete
    Replies
    1. Yes madam.. very true.. thanks for your comments.. :)

      Delete